పల్లవి
చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥
చరణం1
హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణ యతి ప్రాసల రస ధ్వని శాఖల కవితలల్లు పులుగు
నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు ॥చ॥
చరణం2
అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాథుని కవితా సుధారలో అమర గఙ్గ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రస ధారయై ధ్రువ తారయై మన దేశ భాషలను లెస్సయై
దేవ భాషతో చేలిమిచేసి పలు దేశ దేశముల వాసికెక్కినది
చరణం3
మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళి
అజన్త పదముల అలఙ్కృతం మన భాష అమృత జనితం
భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం... ॥చ॥
- జొన్నవిత్తుల రామలిఙ్గేశ్వర రావు
Browse Related Categories: