రాగం: వరాళి
తాళం: ఆది
అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడణ్డి ॥ అదిగో ॥
ముదముతో సీత ముదిత లక్ష్మణుడు
కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥ అదిగో ॥
చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సున్దరమై యుణ్డెడి ॥ 2 ॥ అదిగో ॥
అనుపమానమై అతిసున్దరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥ అదిగో ॥
కలియుగమన్దున నిల వైకుణ్ఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ॥ 4 ॥ అదిగో ॥
పొన్నల పొగడల పూపొద రిణ్డ్లతొ
చెన్ను మీరగను చెలగుచునున్నది ॥ 5 ॥ అదిగో ॥
శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ॥ 6 ॥ అదిగో ॥