శ్రీకణ్ఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా
చన్ద్రధారీ మహేన్ద్రాది బృన్దారకానన్దసన్దోహసన్ధాయి పుణ్యస్వరూపా
విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వమ్బు భేదిఞ్చి
బుద్ధిం బ్రధానమ్బు గర్మమ్బు విజ్ఞాన మధ్యాత్మయోగమ్బు సర్వ
క్రియాకారణం బఞ్చు నానాప్రకారమ్బుల్ బుద్ధిమన్తుల్ విచారిఞ్చుచున్
నిన్ను భావిన్తు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతీ
నీవు లోకత్రయీవర్తనమ్బున్ మహీవాయుఖాత్మాగ్ని
సోమార్కతోయమ్బులం జేసి కావిఞ్చి సంసారచక్ర క్రియాయన్త్రవాహుణ్డవై
తాదిదేవా మహాదేవ నిత్యమ్బు నత్యన్తయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీప
ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాన్ధకారుల్ జితక్రోధ
రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీన్ద్రుల్ భవత్పాద పఙ్కేరుహధ్యాన
పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులై నిత్యులై రవ్య యాభవ్య సేవ్యాభవా
భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది
నానామునిస్తోత్రదత్తావధానా
లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానఙ్గ భస్మానులిప్తాఙ్గ గఙ్గాధరా నీ
ప్రసాదమ్బున్ సర్వగీర్వాణగన్ధర్వులున్
సిద్ధసాధ్యోరగేన్ద్రా సురేన్ద్రాదులున్
శాశ్వతైశ్వర్య సమ్ప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు
నభ్యర్థితమ్బుల్ ప్రసాదిమ్పు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
నమస్తే నమస్తే నమః ॥
ఇతి శ్రీమహాభారతే నన్నయ్య విరచిత శివ దణ్డకమ్ ॥