అన్నమయ్య కీర్తన మేదిని జీవుల గావ
రాగం: రేవగుప్తి ఆ: స రి1 గ3 ప ద1 స అవ: స ద1 ప గ3 రి1 స తాళం: ఆది పల్లవి మేదిని జీవుల గావ మేలుకోవయ్యా । నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥ (2) చరణం 1 తగుగోపికల కన్నుదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా । తెగువ రాక్షసులనే తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥ మేదిని జీవుల గావ మేలుకోవయ్యా..(ప..) చరణం 2 ఘనదురితపు గలువలు వికసించె మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా । పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ॥ మేదిని జీవుల గావ మేలుకోవయ్యా..(ప..) చరణం 3 వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ మెరయు దోషరహిత మేలుకోవయ్యా । పొరసి నీవు నిత్యభోగములు భోగించ నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ॥ మేదిని జీవుల గావ మేలుకోవయ్యా । నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥ (2)
Browse Related Categories: