View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

భ్రమరామ్బికా అష్టకమ్

రవిసుధాకర వహ్నిలోచన రత్నకుణ్డల భూషిణీ
ప్రవిమలమ్బుగ మమ్మునేలిన భక్తజన చిన్తామణీ ।
అవని జనులకు కొఙ్గుబఙ్గారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 1 ॥

కలియుగమ్బున మానవులకును కల్పతరువై యుణ్డవా
వెలయగును శ్రీ శిఖరమన్దున విభవమై విలసిల్లవా ।
ఆలసిమ్పక భక్తవరులకు అష్టసమ్పద లీయవా
జిలుగు కుఙ్కుమ కాన్తిరేఖల శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 2 ॥

అఙ్గ వఙ్గ కలిఙ్గ కాశ్మీరాన్ధ్ర దేశములన్దునన్
పొఙ్గుచును వరహాల కొఙ్కణ పుణ్యభూముల యన్దునన్ ।
రఙ్గుగా కర్ణాట రాట మరాట దేశములన్దునన్
శృఙ్గినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 3 ॥

అక్షయమ్బుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శామ్భవీ ।
మోక్షమోసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 4 ॥

ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహమ్బుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ ।
అగ్రపీఠమునన్దు వెలసిన ఆగమార్థ విచారిణీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 5 ॥

నిగమగోచర నీలకుణ్డలి నిర్మలాఙ్గి నిరఞ్జనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ ।
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చన్ద్రముఖి సీమన్తినీ
చిగురుటాకులవణ్టి పెదవుల శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 6 ॥

సోమశేఖర పల్లవాధరి సున్దరీమణీ ధీమణీ
కోమలాఙ్గి కృపాపయోనిధి కుటిలకున్తల యోగినీ ।
నా మనమ్బున పాయకుణ్డమ నగకులేశుని నన్దినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 7 ॥

భూతనాథుని వామభాగము పొన్దుగా చేకొన్దువా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొణ్టివా ।
పాతకమ్బుల పారద్రోలుచు భక్తులను చేకొణ్టివా
శ్వేతగిరిపై నుణ్డి వెలసిన శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 8 ॥

ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నన్దున
పల్లవిఞ్చును నీ ప్రభావము బ్రహ్మలోకము నన్దున ।
తెల్లముగ కైలాసమన్దున మూడులోకము లన్దున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 9 ॥

తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భఙ్గినీ ।
వరుసతో నీ యష్టకమ్బును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరామ్బికా ॥ 10 ॥




Browse Related Categories: