View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

నారాయణ శతకమ్ (తెలుగు)

శా. శ్రీరామామణి పాణిపఙ్కజమృదుశ్రీతజ్ఞ పాదాబ్జ శృం
గారాకారశరీర, చారుకరుణాగమ్భీర, సద్భక్తమం
దారామ్భోరుహపత్రలోచన కళాధారోరుసమ్పత్సుధా
పారావారవిహార, నా దురితముల్‌ భఞ్జిమ్పు నారాయణా! 1

మ. కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్‌
గడముట్ట న్వినుతిమ్ప లేక నిగుడ\న్‌ గ్రాలఙ్గ నొప్పారు మి
మ్మడర\న్‌ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని, లోభాత్ముఁడ\న్‌
జడుఁడ, న్నజ్ఞుఁడ, నైకజిహ్వుఁడ, జనస్తబ్ధుణ్డ, నారాయణా! 2

శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొణ్డెవ్వరి\న్‌
ధ్యానిమ్పం బ్రణుతిమ్ప నట్లగుటకు న్నా నేర్చు చన్దమ్బున\న్‌
నీ నామస్తుతు లాచరిఞ్చు నెడల న్నే తప్పులుం గల్గిన\న్‌
వానిన్‌ లోఁగొనుమయ్య, తణ్డ్రి, విహితవ్యాపార, నారాయణా! 3

మ. నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకమ్బు పద్యమ్బులో
నొరుగుల్‌ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగమ్బె చర్చిమ్పఁగాఁ
గుఋగ ణ్పైనను వఙ్కబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం
జెఱకుం గోలకు తీపు గాక కలదే, చే దెన్దు, నారాయణా! 4

మ. చదువుల్‌ పెక్కులు సఙ్గ్రహిఞ్చి పిదపం జాలఙ్గ సుజ్ఞాని యై
మదిలోఁ బాయక నిన్ను నిల్పఁ దగు నామర్మమ్బు వీక్షిమ్పఁడే
మొదలం గాడిద చారుగన్ధవితతుల్‌ మోవఙ్గ శక్యమ్బె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త, నారాయణా! 5

మ. లలిఁ గబ్బమ్బు కరాట మివ్వసుధ నెల్లం న్మిఞ్చెఁ బో నీకథా
వళి కర్పూరము నిఞ్చిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్‌
పెలుచం బూనిన యక్కరాటము తుదిన్‌ బేతేకరాటమ్బె పో
చలదిన్దీవరపత్రలోచన, ఘనశ్యామాఙ్గ, నారాయణా! 6

మ. మన మార న్నచలేన్ద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై
మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై
యెనయ\న్‌ సాయకశాయికిం జననియై యేపారు మిన్నేటికిం
జని మూలమ్బగు నఙ్ఘ్రి నాదు మదిలోఁ జర్చిన్తు, నారాయణా! 7

శా. నీ పుత్రుణ్డు చరాచరప్రతతుల న్నిర్మిఞ్చి పెమ్పారఁగా
నీ పుణ్యాఙ్గన సర్వజీవతతుల న్నిత్యమ్బు రక్షిమ్పఁగా
నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా
నీ పెమ్పేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా! 8

శా. బ్రహ్మాణ్డావలిలోన సత్వగుణివై బాహ్యమ్బునం దాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్‌ భవ్యాధినాథుణ్డవై
బ్రహ్మేన్ద్రామరవాయుభుక్పతులకు\న్‌ భావిమ్ప రాకున్న నా
జిహ్మవ్యాప్తుల నెన్న నాదు వశమే చిద్రూప, నారాయణా! 9

మ. ధర సింహాసనమై నభమ్బు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వన్దిగణమై బ్రహ్మాణ్డ మాగారమై
సిరి భార్యామణియై విరిఞ్చి కొడుకై శ్రీగఙ్గ సత్పుత్రియై
వరుస న్నీ ఘనరాజసమ్బు నిజమై వర్ధిల్లు, నారాయణా! 10

మ. మగమీనాకృతి వార్ధిఁ జొచ్చి యసురు న్మర్దిఞ్చి యవ్వేదముల్‌
మగుడం దెచ్చి విరిఞ్చి కిచ్చి యతని న్మన్నిఞ్చి యేపారఁగాఁ
బగ సాధిఞ్చిన దివ్యమూర్తి వని నే భావిన్తు నెల్లప్పుడున్‌
ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా! 11

మ. అమరుల్‌ రాక్షసనాయకుల్‌ కడఁకతో నత్యన్తసామర్థ్యులై
భ్రమరీదణ్డము మన్దరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా
దమకిఞ్చె\న్‌ భువనత్రయమ్బును గిరుల్‌ దన్తావళుల్‌ మ్రొగ్గినం
గమఠమ్బై ధరియిఞ్చి మిఞ్చిన జగత్కల్యాణ, నారాయణా! 12

శా. భీమాకారవరాహమై భువనముల్‌ భీతిల్లి కమ్పిమ్ప ను
ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాన్ధునిన్‌
హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మి\న్‌ గారవిమ్పఙ్గ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజిన్తు నారాయణా! 13

శా. స్తమ్భమ్బన్దు నృసింహమై వెడలి యచ్చణ్డాట్టహాసధ్వనుల్‌
దమ్భోళిం గడువఙ్గ హేమకశిపోద్దణ్డాసురాధీశ్వరు\న్‌
శుమ్భద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్‌ శోభిల్ల మన్నిఞ్చి య
జ్జమ్భారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చిన్తు, నారాయణా! 14

మ. మహియు న్నాకసముం బదద్వయ పరీమాణమ్బుగాఁ బెట్టి యా
గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తమ్బుగా నెమ్మితో
విహరిఞ్చిన్ద్ర విరిఞ్చి శఙ్కర మహావిర్భూత దివ్యాకృతిన్‌
సహజమ్బై వెలసిల్లు వామన లసచ్చారిత్ర, నారాయణా! 15

మ. ధరణిన్‌ రక్తమహాహ్రదమ్బు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
పరగం బైతృక తర్పణమ్బుకొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్‌
నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జిఞ్చి త
త్పరశుభ్రాజిత రామనామము కడు\న్‌ ధన్యమ్బు, నారాయణా! 16

మ. వరుసం దాటకిఁ జమ్పి కైశికు మఘ స్వాస్థ్యమ్బు గావిఞ్చి శం
కరు చాపం బొగిఁ ద్రుఞ్చి జానకిఁ దగం గల్యాణమై తణ్డ్రిపం
పరుదారన్‌ వనభూమి కేఁగి జగదాహ్లాదమ్బుగా రావణున్‌
ధరణిం గూల్చిన రామనామము కడు\న్‌ ధన్యమ్బు, నారాయణా! 17

మ. యదువంశమ్బునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్‌
మదవద్ధేనుక ముష్టికా ద్యసురుల\న్‌ మర్దిఞ్చి లీలారసా
స్పద కేళీరతి రేవతీవదన కఞ్జాతాన్తభృఙ్గం బన\న్‌
విదితమ్బౌ బలరామమూర్తివని నిన్‌ వీక్షిన్తు, నారాయణా! 18

మ. పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారిమ్పఁ ద
త్పురనారీ మహిమోన్నతుల్‌ సెడుటకై బుద్ధుణ్డవై బుద్ధితో
వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రబోధిఞ్చి య
ప్పురముల్‌ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యమ్బు, నారాయణా! 19

మ. కలిధర్మమ్బునఁ బాపసఙ్కలితులై గర్వాన్ధులై తుచ్ఛులై
కులశీలమ్బులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
బలిగాఁ జేయఁ దలఞ్చి ధర్మ మెలమిం బాలిఞ్చి నిల్పఙ్గ మీ
వలనం గల్క్యవతార మొన్దఁగల నిన్‌ వర్ణిన్తు నారాయణా! 20

మ. ఇరవొన్ద\న్‌ సచరాచరప్రతతుల న్నెన్నఙ్గ శక్యమ్బు కా
కరయ\న్‌ పద్మభవాణ్డ భాణ్డచయము న్నారఙ్గ మీకుక్షిలో
నరుదార న్నుదయిఞ్చుఁ బెఞ్చు నడఁగు న్నన్నారికేళోద్భవాం
తర వాఃపూరము చన్ద మొన్ది యెపుడున్‌ దైత్యారి నారాయణా! 21

మ. దళదిన్దీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ
లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
మల నాభీచరణారవిన్దజనితామ్నాయాద్యగఙ్గా! లస
జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చిన్తు నారాయణా! 22

మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాఙ్గ! భూ
గగనార్కేన్దుజలాత్మపావక మరుత్కాయా! ప్రదీపప్రయో
గి గణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణ సంసేవితా!
త్రిగుణాతీత! ముకున్ద! నాదు మదిలో దీపిమ్పు, నారాయణా! 23

శా. భూతవ్రాతము నమ్బుజాసనుఁడవై పుట్టిన్తు విష్ణుణ్డవై
ప్రీతిం బ్రోతు హరుణ్డవై చెఋతు నిర్భేద్యుణ్డవై త్రైగుణో
పేతమ్బై పరమాత్మవై నిలుతు నీ పెమ్పెవ్వరుం గాన ర
బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ఠ, నారాయణా! 24

మ. వరనాభీధవళామ్బుజోదరమున\న్‌ వాణీశుఁ గల్పిఞ్చి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమన్దు శివునిం బుట్టిఞ్చి యామేటికిం
బరమోత్తంసముగా వియత్తలనదిం బాదమ్బులం గన్న మీ
సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా! 25

మ. ప్రభ మీనాభి జనిఞ్చినట్టి విలసత్పద్మోరుసద్మమ్బునం
బ్రభవమ్బైన విరిఞ్చి ఫాలజనిత ప్రస్వేదసమ్భూతుఁడై
యభిధానమ్బును గోరి కాఞ్చెను భవుం డార్యేశు లూహిమ్పఁగా
నభవాఖ్యుణ్డవు ని న్నెఋఙ్గవశమే యబ్జాక్ష, నారాయణా! 26

మ. పటుగర్భాన్తరగోళభాగమున నీ బ్రహ్మాణ్డభాణ్డమ్బు ప్రా
కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాన్త మమ్భోధిపై
వటపత్రాగ్రముఁ జెన్ది యొప్పిన మిము న్వర్ణిమ్పఁగా శక్యమే
నిటలాక్షామ్బురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా! 27

మ. సవిశేషోరు సువర్ణబిన్దువిలస చ్చక్రాఙ్కలిఙ్గాకృతి\న్‌
భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీప్యన్మునీన్ద్రాళిచే
నవదివ్యార్చన లన్దుచున్దువు రమానారీశ, నారాయణా! 28

మ. సర్వమ్బున్‌ వసియిఞ్చు నీతనువునన్‌ సర్వమ్బునం దుణ్డగా
సర్వాత్మా! వసియిఞ్చు దీవని మదిన్‌ సార్థమ్బుగాఁ జూచి యా
గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్‌ గీర్తిన్తు రేప్రొద్దు నా
శీర్వాదమ్బు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా! 29

మ. గగనాద్యఞ్చితపఞ్చభూతమయమై కఞ్జాతజాణ్డావలిన్‌
సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్‌ సంసారివై చిత్కళా
సుగుణమ్బై విలసిల్లు దీవు విపులస్థూలమ్బు సూక్ష్మమ్బునై
నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా! 30

మ. ఎల రారన్‌ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తమ్బులోఁ
బొలుపారం దగిలుణ్డునేని యఘముల్‌ పొన్దఙ్గ నె ట్లోపెడు\న్‌
కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠమ్బుపైఁ గీటముల్‌
నిలువ న్నేర్చునే భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా! 31

మ. కలయం దిక్కులు నిణ్డి చణ్డతరమై కప్పారు మేఘౌఘముల్‌
వెలయ\న్‌ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచన్దమ్బున\న్‌
జలదమ్భోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్‌
దొలఁగు న్మీ దగు దివ్యమన్త్రపఠన\న్‌ దోషఘ్న, నారాయణా! 32

మ. కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసన్ధాయియై
నలి నొప్పారెడు మన్త్రరాజమగు నీనామమ్బు ప్రేమమ్బుతో
నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయు\న్‌
వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా! 33

మ. పరమమ్బై పరతత్వమై సకలసమ్పత్సారమై భవ్యమై
సురసిద్ధోరగయక్ష పక్షిమునిరక్షో హృద్గుహాభ్యన్తర
స్థిరసుజ్ఞానసుదీపమై శ్రుతికళాసిద్ధాన్తమై సిద్ధమై
సరి లే కెప్పుడు నీదునామ మమరున్‌ సత్యమ్బు, నారాయణా! 34

మ. అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీన్ద్రజా జిహ్వకున్‌
సుధయై వేదవినూత్నరత్నములకున్‌ సూత్రాభిధానమ్బునై
బుధసన్దోహమనోహరాఙ్కురమునై భూదేవతాకోటికిన్‌
విధులై మీబహునామరాజి వెలయున్‌ వేదాత్మ, నారాయణా! 35

మ. పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదమ్బునం
దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దును\న్‌
ఘనపాపమ్బుల వైరి షడ్రిపులకు\న్‌ గాలావసానమ్బు మీ
వినుతాఙ్ఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా! 36

మ. భవరోగమ్బుల మన్దు పాతకతమోబాలార్కబిమ్బమ్బు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాఞ్జనశ్రేష్ఠమై
భువిలో మీదగు మన్త్రరాజ మమరున్‌ భూతాత్మ, నారాయణా! 37

మ. వరుసన్‌ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళమ్బులోఁ
బరుషాకారముతో వసిఞ్చిన మహా పాపోరగశ్రేణికిం
బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటిమ్పుచు న్నుణ్డు మీ
తిరుమన్త్రం బగు మన్త్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా! 38

మ. హరుని న్నద్రిజ నాఞ్జనేయుని గుహు న్నయ్యమ్బరీషున్‌ ధ్రువుం
గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్‌ ఘణ్టాశ్రవు న్నారదు\న్‌
గర మొప్ప న్విదురున్‌ బరాశరసుతున్‌ గాఙ్గేయుని\న్‌ ద్రౌపదిన్‌
నరు నక్రూరునిఁ బాయకుణ్డును భవన్నామమ్బు, నారాయణా! 39

శా. శ్రీకిన్మన్దిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా
భీకఞ్జాతము, చన్ద్రికాన్తర సుధాభివ్యక్త నేత్రమ్బులు\న్‌,
లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాఙ్ఘ్రియు\న్‌ గల్గు నా
లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా! 40

శా. విన్దుల్‌ విన్దు లటఞ్చు గోపరమణుల్‌ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ
డన్దెల్‌ మ్రోయఁగ ముద్దుమోమలర ని న్నాలిఙ్గితుం జేయుచో
డెన్దమ్బుల్‌ దనివార రాగరసవీటీలీలల\న్‌ దేల్చు మీ
మన్దస్మేర ముఖేన్దురోచులు మము న్మన్నిఞ్చు, నారాయణా! 41

శా. విన్దు ల్వచ్చిరి మీయశోదకడకు న్వేగమ్బె పొ మ్మయ్యయో
నన్దానన్దన! చన్దనాఙ్కురమ! కృష్ణా! యిఙ్కఁబో వేమి మా
మన్దం జాతర సేయఁబోద మిదె రమ్మా యఞ్చు మి మ్మెత్తుకో
చన్దం బబ్బిన నుబ్బకుణ్డుదురె ఘోషస్త్రీలు, నారాయణా! 42

శా. అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో
వెన్నల్‌ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తి వై
యున్నన్‌ దిక్కులు చూచుచున్‌ బెగడి నిన్నోలి న్నుతుల్‌ సేయుచున్‌
గన్నుల్‌ మూయ యశోదకున్‌ జిఋత వై కన్పిన్తు, నారాయణా! 43

శా. ఉల్లోలమ్బులుగాఁ గురుల్‌ నుదుటిపై నుప్పొఙ్గ మోమెత్తి ధ
మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రమ్బుగా నీవు వ్రే
పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లమ్బు మీ
పిల్లఙ్గ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెమ్పొప్పు, నారాయణా! 44

మ. కసవొప్పన్‌ పసి మేసి ప్రొద్దు గలుగం గాన్తారముం బాసి య
ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాఙ్గనా
రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్‌
పసిఁ గొఞ్చున్‌ బసిఁ గొఞ్చు వచ్చుటలు నే భావిన్తు, నారాయణా! 45

శా. చన్నుల్‌ మీదిఁకి చౌకళిమ్ప నడుముం జవ్వాడ కన్దర్పసం
పన్నాఖ్యమ్బు నటిఞ్చు మాడ్కి కబరీభారమ్బు లూటాడఁగా
విన్నాణమ్బు నటిమ్ప గోపజన గోబృన్దమ్బుతో వచ్చు మీ
వన్నెల్‌ కన్నుల ముఞ్చి గ్రోలుటలు నే వర్ణిన్తు, నారాయణా! 46

మ. పెరుగుల్‌ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమమ్బునం జూచి రా
గ రసావేశత రిత్త ద్రచ్చ నిడ నాకవ్వమ్బు నీవు న్మనో
హరలీలం గనుగొఞ్చు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ
వరవృత్తాన్తము లేను పుణ్యకథగా వర్ణిన్తు, నారాయణా! 47

శా. కేల\న్‌ గోలయు గూటిచిక్కము నొగిం గీలిఞ్చి నెత్తమ్బునం
బీలీపిఞ్చముఁ జుట్టి నెన్నడుమునం బిఞ్ఛావళి\న్‌ గట్టి క
ర్ణాలఙ్కార కదమ్బగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
వాలన్‌ గాచినభావ మిట్టి దని నే వర్ణిన్తు, నారాయణా! 48

శా. కాళిన్దీతటభూమి నాలకదుపుల్‌ కాలూఁది మేయ\న్‌ సము
త్తాలోల తమాలపాదప శిఖాన్తస్థుణ్డవై వేణురం
ధ్రాలిన్‌ రాగరసమ్బు నిణ్డ విలసద్రాగమ్బు సన్ధిఞ్చి గో
పాలవ్రాతము గణ్డుగోయిలలుగా వర్ణిన్తు, నారాయణా! 49

శా. రాణిఞ్చెన్‌ గడు నఞ్చు నీసహచరుల్‌ రాగిల్లి సోలఙ్గ మీ
వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్‌ బయల్‌ముట్టఁగా
ఘోణాగ్రమ్బులు మీదిఁ కెత్తుకొని లాఙ్గూలమ్బు లల్లార్చి గో
శ్రేణుల్‌ చిన్దులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చిన్తు, నారాయణా! 50

మ. పసులఙ్గాపరి యే మెఋఙ్గు మధురప్రాయోల్లసద్వృత్తవా
గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డఞ్చు ని\న్‌
గసటుల్‌ సేయఁగ నాఁడు గోపిక లతద్గానమ్బులన్‌ మన్మథ
వ్యసనాసక్తులఁ జేయుచన్దములు నే వర్ణిన్తు, నారాయణా! 51

మ. జడ యెన్తేఁ దడ వయ్యె జెయ్యి యలసె\న్‌ శైలమ్బు మాచేతులం
దిడు మన్న\న్‌ జిరునవ్వుతో వదలిన\న్‌ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్‌ బ్రియమన్ద నిన్ద్రుఁ డడలం గోవర్ధనాద్రీన్ద్రమున్‌
గొడుగై యుణ్డగఁ గేలఁ బూనితి గదా గోవిన్ద, నారాయణా! 52

మ. లలితాకుఞ్చితవేణియం దడవిమొల్లల్‌ జాఱ ఫాలస్థలి\న్‌
దిలకం బొయ్యన జాఱఁ గుణ్డలరుచుల్‌ దీపిమ్ప లేఁజెక్కులన్‌
మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వఙ్కల\న్‌ బోవఁగా
నలి గైకొన్దువు గాదె నీవు మురళీనాట్యమ్బు, నారాయణా! 53

శా. మాపాలం గడు గ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తిన్తువే
మాపాలెమ్బుల వచ్చి యుణ్డుదు వెస న్మాపాలలో నుణ్డు మీ
మాపా లైనసుఖాబ్ధిలో మునుగుచున్‌ మన్నిఞ్చి తా గొల్లలన్‌
మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నిన్తు, నారాయణా! 54

మ. ఒకకాన్తామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కణ్డ వై
సకలస్త్రీలకు సన్తతం బలర రాసక్రీడ తన్మధ్య క
ల్పకమూలమ్బు సవేణునాదరస మొప్పఙ్గా బదార్వేల గో
పికలం జెన్ది వినోద మొన్దునెడ నీ పెమ్పొప్పు నారాయణా! 55

మ. లలితం బైన భవత్తనూవిలసనన్‌ లావణ్యదివ్యామృతం
బలుఁగు ల్వారఁగ నీకటాక్షమునఁ దా మన్దన్ద గోపాఙ్గనల్‌
తలఁపు ల్పాదులు కట్టి కన్దళిత నూత్నశ్రీలు వాటిన్తు రా
నెలతల్‌ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా! 56

మ. లీలన్‌ పూతనప్రాణవాయువులు పాలిణ్డ్లన్దు వెళ్ళిఞ్చి, దు
శ్శీలుణ్డై చను బణ్డిదానవు వెసం జిన్దై పడం దన్ని యా
రోల న్మద్దులు గూల్చి ధేనుదనుజున్‌ రోఁజఙ్గ నీల్గిఞ్చి వే
కూలన్‌ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్‌ దీర్తు, నారాయణా! 57

మ. రసనాగ్రమ్బున నీదు నామరుచియు\న్‌ రమ్యమ్బుగాఁ జెవ్లుకు
న్నసలారఙ్గ భవత్కథాభిరతియున్‌ హస్తాబ్జయుగ్మమ్బులన్‌
వెస నీపాదసుపూజితాదియుగమున్‌ విజ్ఞానమధ్యాత్మకున్‌
వెస నిమ్పొన్దనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా! 58

మ. వరకాళిన్దితరఙ్గడోలికలలో వైకుణ్ఠధామమ్బులో
వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడుభఙ్గి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటిఞ్చు టొప్పును సితామ్భోజాక్ష, నారాయణా! 59

శా. చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
వుల్లాసమ్బున నడ్డ కట్టి మదనోద్యోగానులాపమ్బుల\న్‌
చల్లన్‌ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లమ్బోరుతెఱఙ్గు జిత్తమున నే జర్చిన్తు నారాయణా! 60

మ. కలయ న్వేదములు\న్‌ బురాణములు బ్రఖ్యాతమ్బుగా తెల్పి మీ
వలనన్‌ భక్తి విహీనుఁ డైన పిదపన్‌ వ్యర్థప్రయత్నమ్బె పో
గులకాన్తామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారుసస్యమ్బు దా
ఫలకాలమ్బున నీచపోవు పగిదిన్‌ పద్మాక్ష, నారాయణా! 61

శా. స్నానమ్బుల్‌ నదులన్దు జేయుట గజస్నానమ్బు చన్దమ్బగు\న్‌
మౌనం బొప్ప జపిఞ్చువేద మటవీ మధ్యమ్బులోనే డ్పగున్‌
నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను
న్నీనామోక్తియు నీపదాబ్జరతియున్‌ లేకున్న నారాయణా! 62

మ. అల నీటం దగురొమ్పిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా
యిల పాపమ్బులు దుర్భరత్వము మహాహేయమ్బునం బొన్దినం
బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యమ్బునం బాయునే
పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షిమ్ప నారాయణా! 63

మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం
తున బన్ధిఞ్చిన బన్ధనమ్బు కతనం దుష్పాపపుఞ్జమ్బు లె
ల్లను విచ్ఛిన్నములై యడఙ్గు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా
సున కిమ్పొన్దును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా! 64

మ. తనువుం జీవుఁడు నేక మైనపిదపన్‌ ధర్మక్రియారమ్భుఁ డై
యనయమ్బు న్మది దన్నెఋఙ్గక తుది న్నామాయచే మగ్నుఁ డై
తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద
ర్శన మిమ్పారఁగ భక్తివైభవ మహాసఙ్కాశ నారాయణా! 65

మ. తనకు\న్‌ సాత్వికసమ్పదాన్విత మహాదాసోహభావమ్బునన్‌
ననయమ్బు న్మది నన్యదైవభజనం బారఙ్గ దూలిమ్పుచున్‌
జనితాహ్లాదముతోడ నీచరణముల్‌ సద్భక్తి పూజిఞ్చి ని\న్‌
గనుగొన్నన్తనె కల్మషమ్బు లడఁగుం గర్మఘ్న నారాయణా! 66

మ. పరికిమ్పన్‌ హరిభక్తి భేషజునకున్‌ భవ్యమ్బు గా మీఁద మీ
చరణామ్భోరుహదర్శనమ్బు గలదే సమ్ప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యమ్బుపై నాశలం
బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపామ్భోజాక్ష నారాయణా! 67

మ. పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాన్తరాళమ్బున\న్‌
పరగ న్నీ నిజనామమన్త్ర మొనరన్‌ భక్తి న్ననుష్ఠిమ్పుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్‌ దూలఙ్గ వాకట్టు వాఁ
డరుగున్‌ భవ్యపదమ్బు నొన్దుటకు నై యవ్యక్త నారాయణా! 68

మ. సరిఘోరాన్ధక బోధకారణ విపత్సంసార మాలిన్యము\న్‌
పరమానన్ద సుబోధకారణ లసద్భస్మమ్బుపై నూఁది యా
నిరతజ్ఞానసుకాన్తిదర్పణమున న్నిస్సఙ్గుఁ డై తన్ను దా
నరయం గాఞ్చినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష నారాయణా! 69

మ. పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారమ్భుఁ డై
నిరసిం చేరికిఁ గీడు సేయక మది న్నిర్ముక్తకర్ముణ్డు నై
పరమానన్దనిషేధముల్‌ సమముగా భావిఞ్చి వీక్షిఞ్చు నా
పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా! 70

మ. ఒరులం దన్ను నెఋఙ్గు నియ్యెఋకయు న్నొప్పార నేకాన్త మం
దరయం బైపడు నన్యభామినులపై నాకాఙ్క్షదూరత్వమున్‌
మరణావస్థను నీదునామములె సన్మానమ్బునం దోఁచుటల్‌
ధరలోన న్నివి దుర్లభమ్బులు సుధాధామాక్ష నారాయణా! 71

మ. వెర వొప్ప న్బహుశాస్త్రమన్త్రము లొగి న్వీక్షిఞ్చి వే తెల్పి మీ
వరనామామృతపూర మానుచుఁ దగన్‌ వైరాగ్యభావమ్బున\న్‌
సరి నశ్రాన్తముఁ గోరువారు పిదపన్‌ సంసారమాతుఃపయో
ధరదుగ్ధమ్బులు గ్రోల నేరరు వెస\న్‌ దైత్యారి నారాయణా! 72

శా. వేదమ్బన్దు సునిశ్చయుణ్డగు మహావేల్పెవ్వఁడో యఞ్చు నా
వేదవ్యాస పరాశరుల్‌ వెదకిన న్వేఱొణ్డు లేఁ డఞ్చు మీ
పాదామ్భోజము లెల్లప్రొద్దు మదిలో భావిన్తు రత్యున్నతిన్‌
శ్రీదేవీవదనారవిన్దమధుపా శ్రీరఙ్గ నారాయణా! 73

మ. సుతదారాప్తజనాదివిత్తములపై శూన్యాభిలాషుణ్డు నై
యతనోద్రేకయుతమ్బులై పొదలునయ్యై యిన్ద్రియవ్రాతముల్‌
మృతిఁ బొన్దిఞ్చి దమమ్బునన్‌ శమమునన్‌ మీఱఙ్గ వర్తిఞ్చు ని
ర్గతసంసారి భవత్కృపం బొరయు నో కఞ్జాక్ష నారాయణా! 74

మ. ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్‌ భక్తి న్ననుష్ఠిమ్పుచున్‌
నమర న్నన్న సువర్ణ గో సలిల కన్యా ధారుణి గ్రామ దా
నము లామ్నాయ విధోక్తి భూసురులకున్‌ సన్మార్గుఁ డై యిచ్చువాఁ
డమరేన్ద్రార్చిత వైభవోన్నతుఁ డగు న్నామీఁద నారాయణా! 75

మ. ఇల నెవ్వారి మనమ్బులో నెఋక దా నెన్తెన్త గల్గుణ్డు నా
కొలదిం జెన్ది వెలుఙ్గుచున్దు కలయ న్గోవిన్ద నీరూపుల\న్‌
అలర న్నమ్బు మితమ్బు లైసరసిలో నమ్భోరుహమ్బుల్‌ దగ\న్‌
నిల నొప్పారెడు చన్ద మొన్దె దెపుడు న్నీలాఙ్గ నారాయణా! 76

మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయి\న్‌ మానాథ మీపాదముల్‌
గదియం జేర్చిన వాని కే నొడయడన్‌ గా దఞ్చు నత్యున్నతిన్‌
పదిలుం డై సమవర్తి మృత్యువునకు\న్‌ బాఠమ్బుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెన్త పుణ్యులొ కృపాపారీణ నారాయణా! 77

మ. కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా
షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్‌ సన్ధిఞ్చి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసమ్బు సోఁకు నిను మున్‌ హేమాకృతిస్తోమమై
వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్‌ వేదాత్మ నారాయణా! 78

మ. నిరతానన్దయోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాఙ్గులై మ్రగ్గువా
రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా! 79

మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొనర న్నొప్పెడువారు నీపదరుచి న్నూహిఞ్చు నారాయణా! 80

మ. విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసమ్పత్కళా
స్పద యోగీన్ద్రమనస్సరోజములలో బ్రహ్మేన్ద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపిఞ్చుచున్నట్టి మీ
పదపద్మమ్బులు భావగేహమున నే భావిన్తు నారాయణా! 81

మ. వెలయన్‌ యౌవనకాలమన్దు మరుఁడున్‌ వృద్ధాప్యకాలమ్బునన్‌
బలురోగమ్బులు నన్త్య మన్దు యముఁడుం బాధిమ్ప నట్టైన యీ
పలుజన్మమ్బులు చాల దూలితి ననుం బాలిమ్పవే దేవ మీ
ఫలితానన్ద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా! 82

మ. బలుకర్మాయత పాశబన్ధవితతి\న్‌ బాహాపరిశ్రేణికి\న్‌
జలయన్త్రాన్విత బన్ధయాతనగతిన్‌ సంసారకూపమ్బులో
నలరం ద్రిమ్మరుచుణ్డు నన్ను నకటా! యార్తుణ్డనై వేఁడెదన్‌
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్‌ వేవేగ నారాయణా! 83

మ. మమహఙ్కార వికారసన్నిభ మహామత్తాది లోభాన్ధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఋగ\న్‌ రా దిఙ్క నాలోన నీ
విమలాపాఙ్గ దయా దివాకరరుచిన్‌ వెల్గిమ్పు మిమ్పార నో
కమలానన్ద విహారవక్షలలితా! కఞ్జాక్ష! నారాయణా! 84

మ. పరిపన్ధిక్రియ నొత్తి వెణ్టఁ బడునప్పాపమ్బుఁ దూలిఞ్చి మీ
చరణాబ్జస్థితి పఞ్జరమ్బు శరణేచ్ఛం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుణ్డు దుఃఖమ్బులం
బొరయ న్నీ కపకీర్తి గాదె శరదమ్భోజాక్ష నారాయణా! 85

మ. సతతాచారము సూనృతమ్బు కృపయున్‌ సత్యమ్బునున్‌ శీలమున్‌
నతిశాన్తత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయు\న్‌ ధ్యానము\న్‌
ధృతియున్‌ ధర్మము సర్వజీవహితముం దూరమ్బు గాకుణ్డ స
మ్మతికిం జేరువ మీనివాససుఖమున్‌ మానాథ నారాయణా! 86

మ. భవనాశి\న్‌ గయ తుఙ్గభద్ర యమున\న్‌ భాగీరథిం గృష్ణ వే
త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గఙ్గ యం
దవగాహమ్బున నైన పుణ్యములు బెమ్పారఙ్గ నేఁ డిచ్చట\న్‌
భవదఙ్ఘ్రిస్మరణమ్బునం గలుగు పో పద్మాక్ష నారాయణా! 87

మ. ధర గ్రామాధిపు నిణ్టిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్‌
పరగం జెల్లుట సూచి తీ భువనసమ్పాద్యుణ్డ వైనట్టి మీ
వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్‌ జేసితి\న్‌
కరుణం జేకొని కావు మయ్య త్రిజగత్కల్యాణ నారాయణా! 88

మ. గణుతిమ్ప\న్‌ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా
రణబన్ధుం డని చెప్ప నత్తెఱఁగు దూరం బన్దకుణ్డఙ్గ నే
బ్రణతుల్‌ జేసెదఁ గొన్త యైనఁ గణుతిమ్పం బాడి లేకుణ్డినన్‌
ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా! 89

మ. కరినాథుణ్డు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాన్తుఁడై యీశ మీ
శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ
కరచక్రమ్బున నక్రకణ్ఠము వెస\న్‌ ఖణ్డిఞ్చి మిఞ్చెం దయా
పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా! 90

శా. ఏభావమ్బున ని\న్‌ దలఞ్చె గజయూధేన్ద్రుణ్డు ఆపన్నుఁడై
యేభావమ్బున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావమ్బున నీశరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే
నాభావమ్బున నీతలమ్పుఁ గలుగ న్నా కిమ్ము నారాయణా! 91

శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయిన్తి భిక్షమ్బున\న్‌
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యమ్బునన్‌
నీలగ్రీవుఁడు మిఞ్చి త్రుఞ్చెఁ బురముల్‌ నీప్రాపు సేవిఞ్చినన్‌
నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా! 92

మ. నిను వర్ణిమ్పనివాఁడు మూఁగ మదిలో నీనామమున్‌ వీనుల\న్‌
విని మోదిమ్పనివాఁడు చెవ్డు మరి ని\న్‌ వేడ్క\న్‌ మనోవీథిని\న్‌
గని పూజిమ్పనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారమ్భుఁడై
తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా! 93

మ. నిను వర్ణిమ్పని నీచబన్ధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవమ్బులఁ గోరి తా మనమునన్‌ సేవిఞ్చుచన్దమ్బు తా
నవలం బారిన భూతియన్దు వెలయ న్నాజ్యాహుతుల్‌ పూని వే
ల్చిన చన్దమ్బున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా! 94

మ. నిను వర్ణిమ్పని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాఙ్గకా
నిను నాలిమ్పని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా
నినుఁ బూజిమ్పని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జిన్తిమ్పని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా! 95

శా. నీవే తల్లివి నీవె తణ్డ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ
నీవే నిశ్చలబాన్ధవుణ్డ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ
నీవే శఙ్కరమూలమన్త్ర మరయన్‌ నీవే జగత్కర్తవున్‌
నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా! 96

మ. అపరాధమ్బులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యన్తము\న్‌
విపరీతమ్బుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికి\న్‌
గపటం బిన్తయు లేక దణ్డధరుకుం గట్టీక రక్షిమ్పు మీ
కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా! 97

శా. చెల్లం జేసితి పాతకమ్బులు మది\న్‌ శ్రీనాథ మీనామముల్‌
పొల్లుల్‌ బోవని నమ్మి పద్యశతమున్‌ బూర్ణమ్బుగాఁ జెప్పితిన్‌
చెల్లమ్బో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షిమ్పుమీ
తల్లిం దణ్డ్రియు నీవు గాక యొరులే తర్కిమ్ప నారాయణా! 98

మ. నరసిం హాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ
ధర గోవిన్ద ముకున్ద కేశవ జగత్త్రా తాహితల్పామ్బుజో
దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుణ్ఠమం
దిర పీతామ్బర భక్తవత్సల కృపన్‌ దీవిమ్పు నారాయణా! 99

మ. కడకణ్టం గడలేని సమ్పద లొగిం గావిమ్పు లక్ష్మీశ పా
ల్కడలిన్‌ బన్నగశాయివై భువనముల్‌ గల్పిఞ్చు సత్పుత్రుని\న్‌
బొడమ\న్‌ జేసిన నాభిపఙ్కజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతిం గన్న పదారవిన్దముల నే భావిన్తు నారాయణా! 100

మ. తపముల్‌ మన్త్రసమస్తయజ్ఞఫలముల్‌ దానక్రియారమ్భముల్‌
జపముల్‌ పుణ్యసుతీర్థసేవఫలముల్‌ సద్వేదవిజ్ఞానము\న్‌
ఉపవాసవ్రతశీలకర్మఫలముల్‌ ఒప్పార నిన్నాత్మలో
నుపమిమ్పం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా! 101

శా. శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారిమ్పఁగా
నానన్దస్థితి గల్గు నఞ్చు నిగమార్థానేక మెల్లప్పుడు\న్‌
నానాభఙ్గులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యఞ్చు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తణ్డ్రీ నన్ను నారాయణా! 102

మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్యసన్ధాయియై
నలి నొప్పారెడు మన్త్రరాజ మగు నీనామమ్బు ప్రేమమ్బున\న్‌
అలర న్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహమ్బు దా
వెలయ\న్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా! 103

మ. రమణీయమ్బుగ నాదిమమ్బు నవతారమ్బు\న్‌ భవద్దివ్యరూ
పము నామామృతము\న్‌ దలమ్ప దశకప్రా ప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షము\న్‌ ద్వివిధసమ్ప్రాప్తి\న్‌ శతాన్ధ్రాఖ్య కా
వ్యము నర్పిఞ్చితి మీపదాబ్జములకు\న్‌ వైకుణ్ఠ నారాయణా! 104

శా. నీమూర్తుల్‌ గన నీకథల్‌ వినఁ దుది\న్‌ నీ పాద నిర్మాల్యని
ష్ఠామోదమ్బు నెఋఙ్గ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్‌
నీమం బొప్ప భజిమ్ప నీజపము వర్ణిమ్ప\న్‌ గృపం జేయవే
శ్రీ మిఞ్చ\న్‌ బహుజన్మ జన్మములకు\న్‌ శ్రీయాదినారాయణా! 105




Browse Related Categories: